Monday, June 8, 2020

వ అంటే భ అనిలే

"ఔనంటే కాదనిలే, కాదంటె ఔననిలే" అని పింగళిగారు ఆడువారిగురించి అన్నారు.

అంటే అనిలే, ‘ అన్నా అనిలే, బెంగాలీ బాబుగారి అర్థాలే వేరులే అని నేనంటాను.

అవి నేను వరోడాలో వర్క్ చేస్తున్న రోజులు. కాదు కాదు. బరోడాలో బర్క్ చేస్తున్న రోజులు. sorry. బరోడాలో వర్క్ చేస్తున్న రోజులు. మా ఆఫీసు బిల్డింగ్‌లు చాలా వరకు construction లో ఉండడంవల్ల, అందరినీ తాత్కాలికంగా, ఒక షెడ్లో డెస్క్‌లు వేసి కూచోబెట్టేరు.

నా డెస్క్ ఎదురుగా ఎచ్.ఆర్. డిపార్ట్‌మెంట్ మేనేజర్, ఒక బెంగాలి బాబు (బాస్ భట్టచార్జీ అనుకోండి) కూచొని ఉండే వాడు. ఆ బాస్ గారి డెస్క్ మీద ఒక ఫోను కూడా అమర్చబడింది. అది అందరూ వాడుకోవచ్చు. రోజూ బయటినుంచి ఎవరికైనా ఫోను రావడం, ఆయన వారిని పిలవడం మామూలే.

అలాగే ఒకరోజు ఆయన డెస్క్ మీద ఫోన్ మోగింది. ఆయన ఫోను ఎత్తి, వెంటనే "ఢీ.భీ. పటేల్, ఢీ.భీ. పటేల్, phone for you" అని వత్తులతో సహా గట్టిగా అరిచాడు. ఈ విషయాన్ని కొంత దూరంలో కూచున్న D.B.పటేల్‌కి ఎవరో చేరవేసారు. ఆ సదరు D.B.పటేల్ పరిగెత్తు కొంటూ వచ్చి ఫోన్లో ఒక నిమిషం గుజరాతీలో మాట్లాడేక, ఆ బాస్ భట్టాచార్జీ తో "ఈ ఫోన్ నాకు కాదు, D.V.పటేల్ కి" అని అన్నాడు. ఆ బా.భ. గారు వెంటనే "నేను కూడా అదే పిలిచాను కదా. phone for ఢీ.భీ.పటేల్ అని, మరి నువ్వెందుకొచ్చావ్? ఆర్ యు నాట్ ఢీ.భీ.పటేల్?" అని ఎదురు ప్రశ్న వేసాడు.

D.B.పటేల్ కొంచం తికమకపడి, తర్వాత బుర్రగోక్కొని, ఇంకోసారి తిరిగి ఫోన్ తీస్కొని, గుజరాతీలో ఆ ఫోన్ తనకి కాదని మళ్ళా కన్‌ఫర్మ్ చేకొన్నాక, బా.భ. గారితో "I am D.B.Patel. But this call is for D.V.Patel. V V V. Not B" అని కొంచం కోపంగానే సమాధానం చెప్పాడు. ఈ సరికి, ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ, చేస్తున్న పనులు మానుకొని, ఏం జరుగుతోందా అని, బా.భ./డి.బి.ల వైపే చూడ్డం మొదలుపెట్టారు. బా.భ.గారు తక్కువ తిన్నారా. ఆయన ధోరణి ఆయనదే. అసలే మేనేజరాయె. పైగా తన accent మీద అవతలి వారు కామెంట్ చేస్తే ఈగో ఊరుకుంటుందా.

భీళ్ళ భాగ్యుద్ధం ఒక ఐదు నిమిషాలపాటు అలాగే సాగింది. ఈలోగా బయటికెళ్ళిన, నా కొలీగ్, డి.వి.పటేల్ అప్పుడే రావడం, నేనతనితో తనకి ఫోన్ వచ్చిందని చెప్పడం, అతను బా.భ.గారి డెస్క్ దగ్గరికెళ్ళి, ఫోన్ తీస్కొని మాట్లాడడం, బా.భ.గారికి thanks చెప్పి తిరిగి వచ్చెయ్యడం కూడా అయిపోయాయి. బా.భ. గారి కోపం ఇంకా తగ్గలేదు. డి.బి.పటేల్ కూడ మెల్లగా అక్కడినుంచి చల్లగా జారుకున్నాడు అయినా కూడా . బా.భ. గారు చాలాసేపు రుసరుసలాడుతూనే ఉన్నారు. తర్వాత ఎవరికో ఫోన్‌వస్తే ఎత్తనుకూడా లేదు. మేమందరం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటు ఆ రోజంతా(ఆయనకి వినపడకుండా, కనపడ కుండా) ఆయనమీద జోకులు వేసుకుంటూనే ఉన్నాము.

అదండీ వడోదరా వెంగాలీ వాసు (బరోడా బెంగాలీ బాస్) కథ.

వ అంటే భ అనిలే, బ అన్నా భ అనిలే
బెంగాలీ బాసుగారి భాషంటే వేరులే
భాషంటే వేరులే, ఏక్సెంటే వేరులే


4 comments:

 1. పైన చివర్లోని పేరడీ లైన్లు బాగున్నాయండి 👌🙂.
  భొరొదొ సుందరీ దేభీ, భై ఆర్యూ భేండరింగ్ ఇన్ ది భొరండా అనే బొంగ్లా ఉచ్చారణారాజం కూడా మీకు తెలిసే ఉంటుందిగా? 🙂

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండీ. అవును, కాలేజ్‌లో ఉన్నాప్పుడు భొరండా జోక్ గురించి చెప్పుకునే వాళ్ళం. తర్వాత నాకు అది బరోడాలో (పైన) అనుభవం అయ్యింది

   Delete
 2. యూపీ లో ఇందుకు విరుద్ధంగా బృందావనం ను వృందావన్ అంటారు.

  ReplyDelete
 3. కరెక్టెనండీ. వృందాబన్ అనికూడా కొన్నిచోట్ల రాయడం/పలకడం చూసాను

  ReplyDelete