Saturday, January 1, 2011

మాయావిడ షాపింగ్ లిస్ట్

మా+ఆవిడ (ఏవిడ అని అనుమానపడొద్దు, ఆవిడే) = మాయావిడ. ఇది ఏ సంధో నాకు తెలీదు. ఇదసలు దుష్టసమాసమో లేక శిష్టసంధో కూడా తెలీదు. నేను మాత్రం దీనిని "రేలంగి సంధి లేదా రమణారెడ్డి సమాసం" అని అంటాను. ఎందుకంటే, వాళ్ళిద్దరు మాత్రం (సినిమాలలో వాళ్ళయావిడల్ని) అలా సంభోధిస్తుంటారు.

ఇక అసలు విషయానికొస్తే, మాయావిడ, అందరి యావిడల్లాగే, షాపింగ్‌కి నన్ను పంపినప్పుడు, కొనబోయే సరుకులు నేనెక్కడ మరిచిపోతానో అని (కొనే వస్తువులు రెండైనా, మెండైనా) ఒక షాపింగ్ లిస్ట్ ఇచ్చి పంపిస్తుంది. (కొనే వస్తువు ఒకటైతే మాత్రం లిస్ట్ ఇవ్వదు లెండి. మీరు మరీనూ. మీరు నా మెమొరీ గురించి మరీ అంత అనుమానించి, నన్నవమానించకండి. ఊరికే ప్రాసకోసం అలా రెండు-మెండు అని అన్నాను). మాయావిడ జ్ఞాపకశక్తి, నా జ్ఞాపకశక్తికన్నా గూగోల్ రెట్లు (ఒకటి ప్రక్క వంద సున్నాలు) ఎక్కువ. కాబట్టి, తను షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి లిస్టూ తీసుకుపోదు. గూగ్‌ల్లో కనిపించే అన్ని వస్తువులూ, ఒక్కటి కూడా మరిచిపోకుండా అవలీలగా షాపింగ్ చేసి తెచ్చేస్తుంది. ఇదెలా సాధ్యమా అని చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాన్నేను.

నేను షాపింగ్‌కి వెళ్ళేటపుడు, ఆ లిస్ట్ తీస్కొంటూ, KBC లో అమితాభ్ లాగా "is this your final list" అని అడుగుతాను. మాయావిడ Slumdog లో జమాల్ మాలిక్ లాగ, తల కొంచం అడ్డంగా, కొంచం నిలువుగా ఊపి, ఆ లిస్ట్ వెంటనే నా చేతుల్లోంచి లాక్కొని, ఇంకో రెండు, మూడు సరుకుల్ని దాంట్లో పెన్సిల్‌తో బరికి, తీసుకున్నంత వేగంగానూ, తిరిగి నా చేతిలో కుక్కి "yes. It is my final list" అంటుంది. అలా అనేసి, "మీరు షాప్‌లోంచి బయటికి వచ్చేపుడు ఒక్కసారి ఫోన్ చెయ్యండి. ఇంకేమైనా గుర్తుకువస్తే చెపుతాను" అని ఫైనల్ ఆన్సర్ చెపుతుంది.

ఇక మనం షాప్‌లో కొచ్చాక పడే ఇక్కట్లు. మొదటగా, ఆ లిస్ట్‌లో రాసిన సరుకులు ఒక పట్టాన అర్ధం కావు. అంటే, మాయావిడ ఒక డాక్టరూ, తన చేతి రాత నాకు అర్థం కాదనీ కాదు. ఉదా.కి, లిస్ట్‌లో ఇలా ఉంటాయి "పాలు, కూరగాయలు, పళ్ళు" వగైరా, వగైరా...పూజకి పురోహితుడు భక్తుడికిచ్చిన లిస్ట్‌లాగన్నమాట. అవి ఎన్ని తేవాలో, ఏ రకంవి తేవాలో లాంటివివరాలు అసలేం ఉండవు. వెంటనే, సెల్లులో ఇంటికి కాల్. ఇక రెండవది. కొన్ని సరుకులు షాప్‌లో ఎక్కడ ఉంటాయో కూడా ఒక పట్టాన అంతుపట్టదు. అదీకాక, అసలు అలాంటి సరుకులు ఈ ప్రపంచంలో తయారు చేస్తారా, మనం రోజూ తినే వాటిలో ఇవికూడా తింటామా అన్న అనుమానం కూడ ఒకపరి కలుగుతుంది. ఇది లైఫ్ లో KBC కాబట్టి, మనకి ఒక్కటే లైఫ్ లైన్ ఉంటుంది. అదీ, KBC4 లో లాగ, "Ask the Expert" లైఫ్ లైన్. సో, మళ్ళా ఇంటికి కాల్. మొత్తానికి ఓ పదిసార్లు ఇంటికి ఔట్ గోయింగ్ కాల్స్ అయ్యాక, లిస్ట్‌లో ఉన్న అన్ని సరుకుల్ని కనుక్కొని, షాపింగ్‌కార్ట్‌లొ వేసి, కొనుక్కోడానికి సరిగ్గా చెకౌట్ కౌంటర్ దగ్గరకొచ్చి లైన్‌లో నిలబడ్డాక, అప్పుడు వస్తుంది, ఇంటినుంచి మొట్టమొదటి ఇన్‌కమింగ్ కాల్ "ఏమండీ, ఇంకా షాప్‌లోనే ఉన్నారా, బయటికొచ్చేసారా" అని. జరగబోయేదేమిటో నేను ముందే ఊహించి, "ఇప్పుడే అన్నీ కొని, కార్లో లోడ్ చేసి, బయలుదేరబోతున్నాను. సారీ. కాల్ చెయ్యమన్నావు కానీ మర్చిపోయాను" అని ఒక చిన్న చేదు "నిజాన్ని" చెబుతాను. "ఇంకేమైనా కావాలా" అనైనా అడగకుండా చెవిదగ్గర సెల్ అలాగే పట్టుకొని రెండు క్షణాలు నిలబడతాను. మాయావిడ చెప్పబోయే వస్తువు ఇంకో అయిదు నెలలవరకు అవసరంలేదనుకుంటే, వెంటనే "సరే, త్వరగా వచ్చేయండి" అని అంటుంది. కాకపోతే, ఆ మర్చిపోయిన వస్తువు "ఉప్పు"లాంటిదయితే మళ్ళా వెళ్ళమని అజ్ఞాపిస్తుంది. (ఇది కూడా కొన్ని సార్లు జరిగింది. రోజూ వాడుకొనే ఉప్పు కూడా ఆఖరి చెంచా అయిపోయే వరకు ఆగేవాళ్ళుకూడా ఉంటారా అని నేనొకప్పుడు హాశ్చర్యపోయేవాడిని.)

ఇదీ నేను షాపింగ్ చేసే వైనం. లిస్ట్‌లో ఎన్ని వస్తువులు రాసిందో అన్ని లేదా అంతకంటే తక్కువ సరుకులతో (మిగతావి షాప్‌లో కనబడలేదనే సాకుతో) షాప్ నుంచి బయటపడతాను.

మాయావిడ షాపింగ్ ప్రహసనం చాలా సింప్‌ల్. నేనొకటిరెండుసార్లు తనతో వెళ్ళినప్పుడు పరిశీలించాను (కాదు అనుభవించాను). సాధారణంగా ఎపుడూ లిస్ట్ తీసికెళ్ళదని ముందే చెప్పాగా. ఒకవేళ తీసికెళితే, తన షాపింగ్ రెండు విధాలుగా ఉంటుంది. మొదటి విధం : లిస్ట్‌లో అయిదు వస్తువులు రాసుకొని ఉంటే, కరెక్ట్‌గా 25 వస్తువులు కొంటుంది. అంటే, రాసిన ఒక్కొక్క వస్తువూ, దానితోబాటు దానికి సంబంధించిన మిగతా నాలుగు వస్తువులు కూడా కొనడం అన్నమాట. ఉదా.కి, లిస్ట్‌లో కందిపప్పు ఉంటే, కందిపప్పుతో బాటు, పక్కనే ఉన్న మినప్పప్పు, సెనగపప్పు, పెసరపప్పులు కూడా ఇంట్లో అయిపోయాయని సడెన్‌గా గుర్తుకు రావడం వల్ల అవికూడా కార్ట్‌లో కెక్కి కూచుంటాయి. ఇక రెండో విధం : ఇది, వెంట తెచ్చుకొన్న లిస్ట్ షాప్‌లో ప్రవేశించేంతవరకు ఉండి సడెన్‌గా మాయమైనప్పుడు జరిగేది. లిస్ట్‌లో రాసినవి తప్ప షాప్‌లో ఉన్న మిగతావన్నీ కొనడం. ఆ టైంలో మాయావిడ గూగోల్ మెమొరీ అంతా ఏమౌతుందో తెలీదు.

గమనిక: ఈ బ్లాగు మగవారు మాత్రమే చదవాలి. ఒకవేళ మహిళలు చదివినా, కామెంటరాదు. కామెంటితే, అవి ఎలా ఉంటాయో ముందుగానే ఊహించగలను. ఒకవేళ కామెంటినా, అవి ఎడిటబడగలవు.

గమనిక చివర్లో ఎందుకుంచానా అని సందేహించకండి.