ఈ కృష్ణశుక్రవారము ఏమిటి, ఎప్పుడూ వినలేదనుకుంటున్నారా. ఇది అమెరికాలో జరుపుకునే పండగలెండి. కార్తీక మాసంలోని (అంటే నవంబర్ నెలలో) నాలుగవ గురువారం ఇక్కడ అమెరికన్‌లకి చాలా పెద్ద పండుగ. దానిని ధన్యవాదార్పిత దినము (Thanksgiving Day) అని అంటారు. ధన్యవాదార్పిత దినము తరువాత వచ్చే శుక్రవారమే కృష్ణశుక్రవారం (Black Friday). ఈ రోజు అమెరికాలోని అతి పెద్ద అమ్మకాలు జరిగే రోజు (ఇక్కడ "అమ్మకాలు" అన్నది ఒక్క పదమేనని గమనించవలెను). ఇంతకీ ఈ వ్రతం/పండగ ఎలా జరుపుకుంటారు అని అనుకుంటున్నారా? వివరిస్తాను, చిత్తగించండి.
ధన్యవాదార్పిత దినము ఒక్క అమెరికన్‌లు మాత్రమే జరుపుకున్నా, కృష్ణశుక్రవార వ్రతం మాత్రం, అమెరికాలో ఉండే అమెరికన్‌లు, అమెరికన్ ఇండియన్‌లు, ఇండియన్ అమెరికన్‌లు, మన దేశీ(యు)లు, తెల్లవారు, నల్లవారు, మగవారు, ఆడువారు, పిల్లలు, పెద్దలు అనే తరతమ బేధాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. ఈ వ్రతం జరుపుకోదలిచినవారు, ఆ రోజు పెందలకడనే లేచి, మంగళ స్నానాలు చేయకుండానే తమకిష్టమైన దుకాణ దర్శనమునకు బయలుదేరవలెను. దుకాణము తెరచు సమయమునకు (దుకాణములు బ్రహ్మ ముహూర్త సమయంకంటే ముందే తెల్లవారుఝామున 12 నుండి ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా తెరువవచ్చు) ఒక ఐదారు గంటల ముందునుండీ, దుకాణము ముందు చలిలో (సుమారు 30 డిగ్రీల ఫారెన్‌హైట్) క్యూ లోఒంటికాలిమీద నిలబడి లేదా కూచొని తపస్సు చేయవలెను. అమెరికా వచ్చుటకు రంభ, ఊర్వశులకు తావు (వీసా) లేదు కావున, భక్తుల తపస్సునకు ఎట్టి పరిస్థితులలోనూ భంగము వాటిల్లదు. దుకాణము తెరిచిన వెంటనే, వేటకాని విల్లంబు నుండి విడువడిన శరమువలె ఆ దుకాణములోనికి అతి వేగముగా జొరబడి, ఆ రోజు అతి తక్కువ ధరకు విక్రయింపబడు వస్తువులను, ఎవరికిష్టమైనవి వారు తమ తమ దుకాణపు బండ్లలో (shopping carts) వేసుకొని దుకాణదారునకు తగు పైకము చెల్లించి, సాధ్యమైనంత త్వరలో బయటపడి, వేరొక దుకాణమునకేగవలెను.
ఈ వ్రతమొనరించువారు తమ శక్తికొలది ధనముతోగాని, అరువు (క్రెడిట్‌కార్డు) తోగాని ఎన్ని దుకాణదర్శనములు చేసుకొని, ఎన్ని ఎక్కువ వస్తువులు కొన్న, అంత వ్రతఫలము దక్కును. సాధారణముగా మొగవారు ఈ వ్రతము బెస్ట్ బయ్ (BestBuy) అను ఎలెక్ట్రానిక్స్ దుకాణము ముందు తపస్సొనరించి, తమకు, తమ కుటుంబమునకు అ(న)వసరమగు అత్యాధునిక ఎలెక్ట్రానిక్ గృహోపకరణములను అత్యంత స్వల్పమైన ధరలకు పొంది(తిమని భ్రమించి) తరించెదరు. మహిళలు, పిల్లలు, టోయ్‌స్-ఆర్-అస్ (Toys-r-us) అను దుకాణ దర్శనమునకేగి, పిల్లల ఆటవస్తువులకై తపంబొనరించెదరు. బెస్ట్ బయ్ నందు వ్రతసిద్ధికై కొంతమంది భక్తులు గంటలకు బదులు రోజుల తరబడి తపంబొనరించిననూ ఫలసిద్ధి కలుగని సంఘటనలు కోకొల్లలు. మన దేశీయులు కూడా, మాసములో ఒక సారైననూ తెల్లవారుఝామున లేచి దేవాలయమునకు వెళ్ళుటకు బద్ధకించు భక్తులు కూడా, ప్రతి సంవత్సరమూ ఒక్కసారి ఈ వ్రతమొనరించుటకు మాత్రము సంకోచించరు.
నిన్న మేము ఈ వ్రతమొనరించి తరించిన వైనము: గురువారము రాత్రి సుమారు 10 గంటలకు మేమందరమూ మొదట టోయ్‌స్-ఆర్-అస్ దర్శనార్ధమేగి, అచ్చట దుకాణములోనికి హ్యారీ పాటర్ లోని "నాగినీ" సర్పము వలె మెల్లగా ఏతెంచుచున్న అరి భయంకరమైన భక్త జన సందోహమును చూచి కొంచము భయపడి, అతిగా నిరుత్సాహపడి వెనుదిరిగితిమి. దారిలో బెస్ట్‌బయ్ ముందు తపస్సు చేయు భక్తులను చూచి "అక్కటా! ఈ బెస్ట్ బయ్ ముందటి కృష్ణశుక్రవారపు భక్తులు, వైజాగ్ మూడో నెంబర్ ప్లాట్‌ఫారమ్ మీద తెల్లవారుఝామున చలిలో ఈస్ట్‌కోస్ట్ కై ఎదురుచూచు ప్రయాణీకులను తలపింపజేయుచుంటిరి కదా" అనుకొని వాల్-మార్ట్ (Wal-mart) ముఖముగా బయలుదేరితిమి. కృష్ణశుక్రవార వ్రత సిద్ధికై అత్యంత ప్రసిద్ధి పొందిన మరియొక దర్శినీయ స్థలము వాల్-మార్ట్ అను సామాన్య మానవుని దుకాణము. రెండు సంవత్సరముల క్రిందట కృష్ణశుక్రవారపర్వదినము నాడు, న్యూయార్క్ నగరమునందలి ఒక వాల్-మార్ట్ "ఉత్తర ద్వార దర్శనార్ధం" భక్తుల కోసం ద్వారము తెరచిన ఆ దుకాణపు ఉద్యోగస్థుడు, లోనికి ప్రవేశించు భక్తుల ధాటికి తట్టుకొనలేక, వారి పాదముల క్రింద పడి, అసువులు బాసి వెంటనే పరమపదించినాడు. అప్పటినుంచీ, వాల్-మార్ట్ దుకాణములు కొన్ని, వాటి ద్వారములు ముందటిరోజు రాత్రి నుంచి తెరిచియే ఉంచుచుంటిరి. ఇది నాలాంటి బయట చలిలో తపస్సు చేయలేని కొంతమంది భక్తులకు బహు ఆనందదాయకము. వాల్-మార్ట్ చేరిన వెంటనే, లోనికేగి, మాకు అవసరమగు వస్తువులు, ఆటవస్తువుల వద్ద ఒక్కొక్కరూ ఒక్కొక్క చోట వ్యూహాత్మకముగా నిలబడి, అర్ధరాత్రి 12 గంటలు కాగానే వాటిని గ్రహించి, స్వల్ప పైకము వెచ్చించి (<$100), అతి స్వల్ప వ్యవధిలో బయటపడి వ్రతసమాప్త మొనరించితిమి.
ఈ వ్రతము గురించి అంతర్జాలములో లభించు పలు ఉపకరణములు, కథలు వగైరా:
కృష్ణశుక్రవార వైశిష్ట్యము: http://en.wikipedia.org/wiki/Black_Friday_(shopping)
బహు విధములైన కృష్ణశుక్రవార వ్రతకల్పములు: http://bfads.net, http://blackfriday.com
వాల్-మార్ట్ నందు 2 సం.ల క్రితం జరిగిన దుర్ఘటన:
http://www.nytimes.com/2008/11/29/business/29walmart.html$
బెస్ట్‌బయ్‌ముందు నవరాత్రులు తపస్సు చేసిన భక్తుల కథ, వారికి లభించిన ఉచిత ఐ-ప్యాడ్లు.
http://news.holidash.com/2010/11/22/family-pitches-tent-at-best-buy-9-days-before-black-friday/
ఈ వ్రతమహాత్మ్యము యొక్క కథ చదివిన వారూ, విన్న వారూ, అందరూ తమ కుటుంబముతో మరు సంవత్సరం ఈ వ్రతము చేయుదునని ఈ బ్లాగు మూలముగా ప్రమాణము చేయవలెను.
మీరు కూడ, ఈ వ్రతమొనరించినయెడల, మీ అనుభవాలను ఇక్కడ పాఠకులతో పంచుకొనవచ్చును.
baga raasaaru..chaala baavundi
ReplyDelete@Niru గారూ, ధన్యవాదాలు.
ReplyDeleteHappy New Year...మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html
ReplyDelete