Thursday, June 17, 2010

మీరీ పాటలు ఎప్పుడైనా విన్నారా?

మా తమ్ముడు చిన్నప్పుడు తన సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) లోని ప్రశ్న ఒకటి "గ్రామ మునసబు పని ఏమి" అనేది "గ్రామమున సబ్బు పని ఏమి" అని చదివేవాడు. మేము వెంటనే "బట్టలు ఉతుకుట, ఒళ్ళు రుద్దుట, వీపు తోముట" అని జవాబిచ్చేవాళ్ళం.

అదలా ఉంచితే, ఈ బ్లాగుకి "మీరీపాటలు విన్నారా?" అనేకన్నా "మీరీపాటలు ఇలా (అంటే నేను వినినట్లు) విన్నారా?" అని ఉండాలి. చిన్నప్పుడు, మధ్య ప్రదేశ్ లో ఉండడం వలన, హిందీ పాటలు ఎక్కువ వినేవాడిని (కాదు, వినబడేవి). ఇంట్లో తెలుగు, బాహర్ హిందీ వలన, సగం హిందీ అర్ధమయ్యేది, చాలామటుకు అర్ధమయ్యేది కాదు. చదివింది ఆంధ్రాలో అయినా, సెలవులకెప్పుడూ, మ.ప్ర.కేళ్ళేవాడిని. అర్ధం కాకపోయినా, గొడవపెట్టి మరీ హిందీ సినిమాలు చూసేవాడిని.

ఆ టైంలో, ముకద్దర్ కా సికందర్ విడుదలై, పెద్ద హిట్ అయింది. రోడ్ మీద ఎక్కడ చూసినా, అందరూ దాని పాటలు పాడుతూ కనబడేవాళ్ళు. మనమేం తక్కువ తిన్నామా. అందులోని "ఓ సాథీరే" పాట "తేరే భీ నాభి క్యా జీనా" అని పాడేవాడ్ని. ఎందుకంటే, నాకు అలానే వినబడేది కాబట్టి. కాని నాకెప్పుడు ఆ పాట అర్ధమయ్యేది కాదు - హీరో, తన ఫ్రెండ్ బొడ్డు గురించి ఎందుకు బాధ పడుతున్నాడో.

తర్వాత కొన్నాళ్ళకి కుర్బానిలొ నాజియా హసన్ పాటలు బాగా పాప్యులర్ అయ్యేయి. సినిమా ఇప్పటికీ చూడలేదనుకొండి, కాని అందులో పాట "ఆప్ జైసా కోయి, మేరీ జిందగీ మే ఆయే, తో బాత్ బన్‌జాయే", నాకు "తో బాప్ బన్‌జాయే" అని వినబడేది. "ఆ అమ్మాయి జీవితంలోకి ఎవరైనా వెళ్తే, వాళ్ళు వెంటనే తండ్రి అయిపోతారేమో అనుకునేవాడిని".

అలాగే, తెలుగులో భలే తమ్ముడు చూసాను. దాని హిందీ పాట "బార్ బార్ దేఖో" సిలోన్ రేడియోలో తరుచూ వచ్చేది. అది ఎలా అర్ధమయేదంటే, "Bar Bar తిరిగి చూసాను. వెయ్యి Barలు చూసాను. ఏ Bar చూసినా మంచి వస్తువేమి కనిపించలేదు" అని హీరో పాడుతున్నాడనుకునేవాడిని(భలే తమ్ముడులో NTR ఆ పాట ఒక Bar లో పాడతాడు అని తెలుసు) - ఏ Bar చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త Barలు బీరాయణతత్వం లాగ.

హిందీయే కాదండోయ్, తెలుగు పాటలు కూడా కొన్ని సరిగా అర్ధమయేవి/వినిపించేవి కావు. కోడెనాగులో అనుకుంటా పాట "కధ విందువా" అని. అందులో ఒక తల్లి పిల్లలతో, "బయట బాగా వర్షం పడుతోంది, మంచి భోజనం పెడుతూ, ఒక కథ చెపుతాను" అని పాడుతుందనుకునేవాడిని. ఎందుకంటే, ఆ పాట నాకు "కథ, విందు, వానా - కథ, విందు, వానా" అని వినబడేది మరి (కట్టె, కొట్టె, తెచ్చె టైప్‌లో).

ఇంక ఆఖరిగా, ఆరాధనలో రఫీ పాట "నా మది నిన్ను". ఆ పాటలోని ఒక చరణంలో "తలపులలోనే నిలిచేవు నీవే" అని వస్తుంది. తలుపులలో ఎవరైనా ఎలా నిలబడగలరబ్బా అని ఈ చిన్నిబుర్రకి ఎంతకీ తట్టేదికాదు.

మా పిల్లలిద్దరు అమెరికాలో పుట్టి పెరుగుతున్నారు. మరి వాళ్ళు హింది, తెలుగు సినిమాలు చూస్తూ, పాటలు వింటుంటే, వాళ్ళకెలా అర్ధమవుతుంటాయో మరి. వాళ్ళు పెద్దయేక అడిగి ఇలాంటిదే ఒక బ్లాగు రాయాలి.

ఇక వుంటా,
కేకే

36 comments:

  1. lol..blog chaduvutunte bhale navvu vachchindi.

    Friend

    ReplyDelete
  2. బ్లాగు నచ్చినందుకు, నవ్వు వచ్చినందుకు చాలా థాంక్సండీ ఆమ్రపాలి గారు.

    ఇట్లు
    కేకే

    ReplyDelete
  3. హ హ హ ఆ "బాప్ బన్ జాయె" నాకు కూడా అలాగే వినబడేదండీ. ఒరిజినల్ పాట నేను వినలేదు కానీ దాని రీమిక్సు విని నేను అలాగే పాడేదాన్ని. ఆ రీమిక్సులో ఆ అమ్మయి పబ్ లో కవ్విస్తూ పాడుతూ ఉంటుంది సో అర్థం సరిపోయింది అనుకునేదాన్ని. "నా దగ్గరకెవరైనా వస్తే తండ్రి అయిపోతారు" అని చెప్తోంది అనుకునేదాన్ని. తరువాత నా ఫ్రెండు ఒకమ్మాయి నా పాట విని కరక్ట్ చేసింది.

    నాకు బాగా గుర్తున్నదేమిటంటే మిస్సమ్మ లో "బృందావనమది అందరిదీ" పాట. అందులో "ఏందుకె రాధ ఈసునసూయలు" అని వస్తుంది. దాన్ని నేను ఎప్పుడు "ఈ సునసూయలు" అని పాడేదాన్ని, నాకు అలాగే వినిపించేది. "సునసూయలు" అంటే అర్థమేమిటబ్బా అని ఎప్పుడూ బుర్రకొట్టుకునేదాన్ని. పింగళివారేమో మాహాపండితులు కదా, ఆయనెప్పుడు ఇలాంటి గమ్మత్తైన పదాలనే వాడతారు కదా, ఇదీ అందులో ఒకటి కాబోలులే అనుకునేదాన్ని. తరువాత చాలారోజులకి అర్థమయింది. అది ఈసు+ అసూయ=ఈసునసూయ (గుణసంధి) అని :)

    ReplyDelete
  4. Nice article.. Your article title could be equally confusing if read with a space after the first two letters :)

    Like Meeraa Songs, who is Meeree? LOL...


    Seetharam

    ReplyDelete
  5. సౌమ్యగారూ, విజీనారం వాళ్ళకందరికీ ఆ పాట అలాగే వినబడుతుందేమోలెండి:-)

    సీతారాం గారూ, నేనా విషయం గమనించలేదండీ. లేకపోతే, టపాకి "మీరా పాటలు" అని పేరు పెట్టేవాడిని. టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. కేక పెట్టించారు

    waiting for few more

    ReplyDelete
  7. హరేకృష్ణగారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  8. @ కేకే
    మనదీ ఇజీనారామా?
    చెప్పనేలేదు!

    ReplyDelete
  9. "ఓ సాథీరే" పాట "తేరే భీ నాభి క్యా జీనా" అని పాడేవాడ్ని. ఎందుకంటే, నాకు అలానే వినబడేది కాబట్టి. కాని నాకెప్పుడు ఆ పాట అర్ధమయ్యేది కాదు - హీరో, తన ఫ్రెండ్ బొడ్డు గురించి ఎందుకు బాధ పడుతున్నాడో.."

    హ..హ..హ..హ..హ..అబ్బ..నవ్వి నవ్వి అలసిపోయానండీ.. అన్నట్టు.. నాది "విజీనారం" కాకపోయినా కొన్ని పాటలు అలా వినిపించేవండీ చిన్నప్పుడు.

    మీ బ్లాగ్ పేరు "శ్రీ సుగన్ ధ్ " బాగుందండీ. ఇలాగే మంచి మంచి టపాలు రాస్తూ వుండండి.

    ReplyDelete
  10. సౌమ్యగారూ, ఔనండీ. మనది ఇజీనారమండీ (అంటే ఇంటర్మీడియెట్ వరకు ఇజీనారం అన్నమాట).

    ప్రణీత స్వాతి గారూ, బ్లాగ్ పేరు నచ్చినందుకు ధన్యవాదాలండీ. అది మా శ్రీమతి + మా ఇద్దరబ్బాయిల పేర్లు, విడగొట్టి, కొన్ని అక్షరాలు ఎంచుకొని కలిపి తయారుచేసిన కొత్త పేరు.

    ReplyDelete
  11. ఒహ నిజమా, glad to meet you!
    బ్లాగ్లోకంలో ఇజీనారం వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది... ఆల్ హేపీసు :)
    ఇంటర్ తరువాత ఎక్కడికెళ్ళిపోయారేంటి, మీ సొంత ఊరు ఇజీనారమేనా?
    ఏ బడిలో చదివారు?

    ReplyDelete
  12. ఇంటర్ తర్వాత వైజాగ్, తర్వాత చెన్నై, ముంబై, ఇప్పుడు యు.ఎస్.ఎ.
    ఇజీనారంలో చదివింది ఎం.ఆర్.హైస్కూల్ & ఎం.ఆర్.కాలెజ్.

    ReplyDelete
  13. ఓహ్ అవునా...నేనూ ఎం.ఆర్.కాలెజ్ లోనే చదువాను డిగ్రీ వరకు.

    మీరు ఏ year?

    ReplyDelete
  14. బావుంది... మీరంటే, ఏ వింధ్యపర్వతాల మధ్యలో ఉండటం వల్ల వచ్చిన సమస్య ఏమో. ఆంధ్ర లో ఉండి కూడా, నాకు ఇలాంటి సంస్యలు వచ్చాయి. ప్రేమదేశం లోని, 'క..క..క..క...కలేజీ స్టైలే' ఆ పాట ఎప్పుడూ క్లియర్ గా వినపడేది కాదు. అర్థంకాక,, 'కు...కు...కు... కుక్కలేంజేస్తైలే'... అని పాడుకునేవాణ్ణి.

    ReplyDelete
  15. హ.హ.హ.. తెలుగోడుగారూ, నన్ను మించిపోయారు మీరు పాటలు వినడంలో.

    ReplyDelete
  16. కేకే గారు,
    ఆప్ జైసా కోయి, మేరీ జిందగీ మే ఆయే, తో బాత్ బన్‌జాయే", నాకు "తో బాప్ బన్‌జాయే" అని వినబడేది.నాకు ఇప్పటికీ అల్లాగే వినపడుతుంది, నేను అల్లాగే పాడుతుంటాను కూడా పక్కన మా ఆవిడ సరిదిద్దుతున్నా కూడా. బావుంది మీ బ్లాగు. పాడేది మనం కాబట్టి సాహిత్యం మన ఇష్టం.

    ReplyDelete
  17. Chandu గారు, ధన్యవాదాలు కామెంటినందుకు.

    ReplyDelete
  18. హ హ "నాభీ", "బాప్ బన్ జాయే" అదరగొట్టేశారండి నవ్వు ఆగడంలేదు :)

    ReplyDelete
  19. అయితే ఇలాంటి అపార్థాలు చిన్నప్పుడు నా ఒక్కదానికే సొంతం కాదన్నమాట!:-))

    సూప్పర్ గా ఉంది టపా! బోల్డన్ని పాటలు గుర్తు తెచ్చేశారు! ఈ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పాడు కాంచన గంగ సినిమాలో "వనిత లత కవిత, మనలేవు లేక జత" అని ఒక పాట ఉంటుంది. దాన్ని ఈ మధ్య దాకా (అంటే నేను చెప్పేదాకా) "మనలేవులే కజత" అని వింటున్నాడట. పైగా " ఈ కజత ఎవరో, ఏమిటో తెలీట్లేదు, ప్చ్" అనుకుంటున్నాట్ట!

    సౌమ్యా, ఈసునసూయలు నాక్కూడా అర్థమయ్యే వాళ్ళు కాదు.!

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్.. ఇప్పుడు మీరు చెప్పేవరకు నేను "మన లేవు లే కగత" అని పాడుకుంటున్నా.. ("కగత" అంటే ఏమిటో నాకు కూడా తెలీదు - "బుగత" లా ఉంది కదా!)

      Delete
  20. వేణూ శ్రీకాంత్, సుజాత, sunita గార్లకి (అంటే వడలకి కాదు) ధన్యవాదాలు.

    ReplyDelete
  21. సుజాత గారు, కెవ్వ్ నాకు ఈ క్షణం వరకూ అది "మనలేవు లేక జత" అన్న విషయం తెలియదండి. చాలా సార్లు విన్నాను కానీ ’మనలేవులే’ తర్వాత ’కజత’ ’కథట’ ఇలా ఏ పదమూ సరిపోడం లేదు ఏంటా అని గింజుకునే వాడ్ని. ఇప్పుడు విన్నా నాకు అలానే వినిపిస్తుంది :-)

    ReplyDelete
  22. కేకే గారూ, భలే ఉంది మీ టపా!

    సౌమ్య గారూ,
    ‘ఈసున సూయలు’ నాక్కూడా అర్థమయ్యేది కాదు, చాలాకాలం వరకూ. దీనిలో మీరు చెప్పినట్టే ఈసు+ అసూయ ఉన్నాయి గానీ అది ‘గుణసంధి’ కాదు. ఈసున్ + అసూయలు = ఈసునసూయలు. సంధి పేరు... నాకు తెలీదు!:)

    ReplyDelete
  23. హ హ హ వేణూ గారు అసలు అది సంధి కాదు సమాసం. నేనేదో సరదాకి గుణసంధి అని రాసాను. "ఈసునూ, అసూయనూ": అది ద్వంద్వ సమాసం అండీ బాబూ :D

    ReplyDelete
  24. వేణు & ఆ.సౌమ్య గారూ, ఆ పాట గురించి అంతగా మీ సందేహాలు తీరాలంటే, వెంటనే వెళ్ళి బృందావనం మూవీ చూడండి, ఆ పాట కోసం. తర్వాత నా "అరెవ్యూ" చదువుకోవచ్చు.

    ReplyDelete
  25. సౌమ్య బంగారూ, అది సంధి కూడా తల్లీ!

    ఈసున్+అసూయలు= ఈసునసూయలు .....అనునాశిక సంధి(అనుకుంటా! ఎప్పటి సంగతి ఈ సంధులు?)

    తప్పయితే అది ఏ సంధో ఎవరైనా చెప్పండి

    ReplyDelete
  26. ఈసునసూయలు సమాసమే కాదని ఓ తెలుగు భాషావేత్త చెప్పారు. తల్లిదండ్రులు, వాలి సుగ్రీవులు లాగా వేర్వేరు పదాలైతేనే ద్వంద్వ సమాసమవుతాయట.

    ఈసు, అసూయ ఒకే అర్థాన్నిచ్చే మాటలు కాబట్టి ఆ జంట మాటలను సమాసంగా భావించకూడదట. ఇలాంటిదే సిగ్గూశరం అనేమాట.

    ఇంతకీ ‘ఈసునసూయలు అనేది ఏ సంధి?’ అని అడిగాను.
    ఈసున్+అసూయలు= ఈసునసూయలు = పరరూప సంధి అని చెప్పారు. ఈర్ష్యాసూయలు అనే సవర్ణ దీర్ఘ సంధి కూడా ఉంది. దాన్ని వాడకుండా పింగళి వారు ఆ పాట బాణీకి సరిపోయేలా ఈ ప్రయోగం చేసి, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇలా చర్చనీయాంశం చేశారు.:)

    ReplyDelete
  27. ఈ ఈసునసూయలగరించి ఇన్ని వాదప్రతివాదాలు (ఇంకో ద్వంద్వం?) ఎందుకండీ బాబూ. నా ఈ టపా ముఖ్యోద్దేశం "పాటల్లో ఏం మాటలున్నాయని కాదు", ఆ మాటలు మీకు (నాకు) ఎలా వినిపించేయన్నది. నాకైతే ఆ పాట చిన్నప్పుడు ఎక్కువగా విని ఉంటే అది ఖచ్చితంగా "ఎందుకె రాధ, ఈశున్, అనసూయలు" అని వినిపించి ఉండేది. రాధకి కూడా ప్రాధాన్యమిస్తే అది బహుపద ద్వంద్వం, లేకపోతే మామూలు ద్వంద్వం అని సరిపెట్టుకునేవాణ్ణి .

    ReplyDelete
  28. ఓహ్ వేణు గారూ అది సమాసం కాదా! మంచి విషయం వివరించారు. అయితే నేను రెండు సార్లు పప్పులో కాలేసానన్నమాట. ఏమిటో చిన్నప్పుడు చదూకున్నవన్నీ ఇప్పుడు మరపుకొచ్చేస్తున్నాయి.

    కేకే గారూ ఈ ఒక్క కామెంటుకి సెమించేయండి. :)

    ReplyDelete
  29. కేకే గారూ, ‘టపా ముఖ్యోద్దేశం’ వేరంటూనే.. ‘బహుపద ద్వంద్వం’ పేరుతో పక్కదారి ప్రయాణాన్ని మీరే పొడిగించేశారుగా! భలే :)

    ReplyDelete
  30. Good post. Reminds me of Anand movie where the singer himself made it horrible.

    ReplyDelete
  31. "ఆప్ జైసా కోయి, మేరీ జిందగీ మే ఆయే, తో బాత్ బన్‌జాయే", నాకు "తో బాప్ బన్‌జాయే" అని వినబడేది. "ఆ అమ్మాయి జీవితంలోకి ఎవరైనా వెళ్తే, వాళ్ళు వెంటనే తండ్రి అయిపోతారేమో అనుకునేవాడిని"
    చెబితే నమ్మరు. నేను కూడా అచ్చం గా ఇలాగే అనుకునే వాడిని. ఇప్పటికీ అలా అనుకుంటూ నవ్వుకుంటా కూడా :)

    ReplyDelete
  32. thanks for the hearty laughter. enjoyef a lot. plz keep writing. you are giftef with talent !

    ReplyDelete
  33. నేనూ పాడుకున్నా కొన్నిపాటలు నాకు అనిపించినట్టు - "క్యా హువా తేరా వాదా... ఒక్క సం|| ఓయీ రాధా" అంటూ!

    మీ బ్లాగ్ చాలా బావుంది. వారానికి కొన్ని కబుర్లైనా రాయండి. వచ్చి చదివి నచ్చుకుంటాం :)

    ReplyDelete