Thursday, June 17, 2010

మీరీ పాటలు ఎప్పుడైనా విన్నారా?

మా తమ్ముడు చిన్నప్పుడు తన సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) లోని ప్రశ్న ఒకటి "గ్రామ మునసబు పని ఏమి" అనేది "గ్రామమున సబ్బు పని ఏమి" అని చదివేవాడు. మేము వెంటనే "బట్టలు ఉతుకుట, ఒళ్ళు రుద్దుట, వీపు తోముట" అని జవాబిచ్చేవాళ్ళం.

అదలా ఉంచితే, ఈ బ్లాగుకి "మీరీపాటలు విన్నారా?" అనేకన్నా "మీరీపాటలు ఇలా (అంటే నేను వినినట్లు) విన్నారా?" అని ఉండాలి. చిన్నప్పుడు, మధ్య ప్రదేశ్ లో ఉండడం వలన, హిందీ పాటలు ఎక్కువ వినేవాడిని (కాదు, వినబడేవి). ఇంట్లో తెలుగు, బాహర్ హిందీ వలన, సగం హిందీ అర్ధమయ్యేది, చాలామటుకు అర్ధమయ్యేది కాదు. చదివింది ఆంధ్రాలో అయినా, సెలవులకెప్పుడూ, మ.ప్ర.కేళ్ళేవాడిని. అర్ధం కాకపోయినా, గొడవపెట్టి మరీ హిందీ సినిమాలు చూసేవాడిని.

ఆ టైంలో, ముకద్దర్ కా సికందర్ విడుదలై, పెద్ద హిట్ అయింది. రోడ్ మీద ఎక్కడ చూసినా, అందరూ దాని పాటలు పాడుతూ కనబడేవాళ్ళు. మనమేం తక్కువ తిన్నామా. అందులోని "ఓ సాథీరే" పాట "తేరే భీ నాభి క్యా జీనా" అని పాడేవాడ్ని. ఎందుకంటే, నాకు అలానే వినబడేది కాబట్టి. కాని నాకెప్పుడు ఆ పాట అర్ధమయ్యేది కాదు - హీరో, తన ఫ్రెండ్ బొడ్డు గురించి ఎందుకు బాధ పడుతున్నాడో.

తర్వాత కొన్నాళ్ళకి కుర్బానిలొ నాజియా హసన్ పాటలు బాగా పాప్యులర్ అయ్యేయి. సినిమా ఇప్పటికీ చూడలేదనుకొండి, కాని అందులో పాట "ఆప్ జైసా కోయి, మేరీ జిందగీ మే ఆయే, తో బాత్ బన్‌జాయే", నాకు "తో బాప్ బన్‌జాయే" అని వినబడేది. "ఆ అమ్మాయి జీవితంలోకి ఎవరైనా వెళ్తే, వాళ్ళు వెంటనే తండ్రి అయిపోతారేమో అనుకునేవాడిని".

అలాగే, తెలుగులో భలే తమ్ముడు చూసాను. దాని హిందీ పాట "బార్ బార్ దేఖో" సిలోన్ రేడియోలో తరుచూ వచ్చేది. అది ఎలా అర్ధమయేదంటే, "Bar Bar తిరిగి చూసాను. వెయ్యి Barలు చూసాను. ఏ Bar చూసినా మంచి వస్తువేమి కనిపించలేదు" అని హీరో పాడుతున్నాడనుకునేవాడిని(భలే తమ్ముడులో NTR ఆ పాట ఒక Bar లో పాడతాడు అని తెలుసు) - ఏ Bar చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త Barలు బీరాయణతత్వం లాగ.

హిందీయే కాదండోయ్, తెలుగు పాటలు కూడా కొన్ని సరిగా అర్ధమయేవి/వినిపించేవి కావు. కోడెనాగులో అనుకుంటా పాట "కధ విందువా" అని. అందులో ఒక తల్లి పిల్లలతో, "బయట బాగా వర్షం పడుతోంది, మంచి భోజనం పెడుతూ, ఒక కథ చెపుతాను" అని పాడుతుందనుకునేవాడిని. ఎందుకంటే, ఆ పాట నాకు "కథ, విందు, వానా - కథ, విందు, వానా" అని వినబడేది మరి (కట్టె, కొట్టె, తెచ్చె టైప్‌లో).

ఇంక ఆఖరిగా, ఆరాధనలో రఫీ పాట "నా మది నిన్ను". ఆ పాటలోని ఒక చరణంలో "తలపులలోనే నిలిచేవు నీవే" అని వస్తుంది. తలుపులలో ఎవరైనా ఎలా నిలబడగలరబ్బా అని ఈ చిన్నిబుర్రకి ఎంతకీ తట్టేదికాదు.

మా పిల్లలిద్దరు అమెరికాలో పుట్టి పెరుగుతున్నారు. మరి వాళ్ళు హింది, తెలుగు సినిమాలు చూస్తూ, పాటలు వింటుంటే, వాళ్ళకెలా అర్ధమవుతుంటాయో మరి. వాళ్ళు పెద్దయేక అడిగి ఇలాంటిదే ఒక బ్లాగు రాయాలి.

ఇక వుంటా,
కేకే

Wednesday, June 16, 2010

శ్రీసుగన్‌ధ్ బ్లాగు

బ్లాగు చదివే మిత్రులందరికీ నమస్తే

నేను కూడా బ్లాగడం మొదలెట్టాసానోచ్ (మీ అందరి తలకాయలు తినడానికి). ఇప్పటివరకు, నేను "హార్లిక్స్ తాగను, తింటాను" టైపులో, "బ్లాగులు రాయను, చదువుతాను" అని ఉన్నానన్నమాట. చదవడమే కాకుండా, ఎప్పుడైనా కామెంటుతుంటాను కూడా. అలా అని నేనేదో ఇక ప్రతిరోజూ రాసి ఊడ బొడిచేస్తాననుకున్నారేమో (హమ్మయ్య అనుకుంటున్నారా?). భయపడకండి. ఏదో అప్పుడప్పుడు అలా అలా టైం ఉన్నప్పుడు మాత్రం బ్లాగుతాన్లెండి.

ప్రస్తుతానికి ఇక ఉంటా. బై. మరీ అంత మొహమాటం లేకుండా వెళ్ళిపోకండి. కొంచం గుడ్‌లక్ చెప్పి వెళ్ళండి.

ఇట్లు,
కేకే