Friday, July 2, 2010

తర్జుమాలో తప్పిపోయింది...

...అంటే అంటే అంటే....lost in translation అన్నమాట.

సుమారు మూడేళ్ళ క్రితం మేమంతా ఒకసారి ఇండియా వెళ్ళాం. ఒకరోజు అక్కడ ఒక చిన్న ఊర్లో ఉన్న మా బంధువులను చూడ్డానికి వెళ్ళాం. పరిచయాలన్నీ అయేక, మా బంధువు మా పెద్దబ్బాయిని (ఎనిమిదేళ్ళుంటాయి) "నువ్వు ఏం చదువుతున్నావు బాబూ" అని అడిగేరు. వెంటనే మా అబ్బాయి ఆ మాత్రం తెలీదా అన్నాట్టు సీరియస్‌గా "ఏమీలేదు" అని జవాబు చెప్పేడు. మా బంధువుకి కొంచం గ్లోబు గిఱ్ఱున ఆంధ్రా నుంచి అమెరికాకి రివర్సులో తిరిగినట్టనిపించి, "అమెరికాలో పుట్టినప్పటినుంచి పిల్లలందరూ ఇంగ్లీషు మాట్లాడతారు కదా అందుకని వాళ్ళని స్కూల్‌కి అస్సలు పంపనక్కర్లేదా ఏమిటి" అన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి నావైపు చూసేరు.

నాకు విషయం అర్ధమై మా బంధువుతో, "ఆ ప్రశ్నని ఇంగ్లీషులో What grade are you in? అంటే 'నువ్వే తరగతిలో ఉన్నావు?' అని అడగాల"ని చెప్పేను. మా అబ్బాయితో "ఆయనడిగిన ప్రశ్న What (book) are you reading? అని కాదు, తెలుగులో 'ఏ గ్రేడ్‌లో ఉన్నావు?' అనడానికి అలాగే అడుగుతారు" అని వివరించి చెప్పేను. ఇలాంటి "తర్జుమాలో తమాషాలు" నాలాంటి చాలామంది ప్రవాసాంధ్ర పిల్లల తల్లితండ్రులకు అప్పుడప్పుడు ఎదురవుతాయనే అనుకుంటాను.

మా అబ్బాయిలకి ఇప్పటికీ "మేము, మనము" ల మధ్య తేడా తెలీదు. నేను ఎప్పుడైనా వాళ్ళని "ఈ రోజు స్కూల్లో ఏం చేసేర్రా" అని అడిగితే, "మనం రీసెస్ లో టీచర్‌తో ఆడుకున్నాం, తర్వాత మనమందరం లంచ్ తిన్నాం, మన టీం ఈ రోజు గెలిచింది", వగైరా, వగైరా స్కూల్ పనులన్నిటిలో నన్ను కూడా కలిపి నాచేత కూడా చేయించేస్తారు.

ఒకసారి మా అబ్బాయిలిద్దరూ మా తమ్ముడితో ఏదో ఆట ఆడుతుంటే, మా చిన్నబ్బాయి "చిన్నాన్నా, నువ్వెళ్ళు" అన్నాడుట. మా తమ్ముడు, తనకి ఆఫీస్ కి ఆలస్యం అవుతోంది కదా, అందుకు వెళ్ళమంటున్నాడనుకొని ఆట మధ్యలో వదిలేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడుట. తర్వాత, మా అబ్బాయిలిద్దరూ ఒకటే గొడవ "చిన్నాన్న ఆట మధ్యలో ఆపేసి సడెన్‌గా వెళ్ళిపోయాడ"ని. చివరికి తేలిందేమిటంటే, ఏదైనా ఆట ఆడుతుంటే, తర్వాతి వారిని "నువ్వు ఆడాలి/నీ టర్న్" అనడానికి "You go" అని అంటూ ఆడుకుంటారు మా అబ్బాయిలు. అదన్నమాట సంగతి. విషయం అర్ధమై ఆ సాయంత్రం, మా తమ్ముడు నవ్వులే నవ్వులు.

ఏడవతరగతిలో ఉన్నప్పుడు, నాకు తెలుగు సబ్జెక్ట్‌లో ప్రతిపదార్ధం అంటే తెలిసేదికాదు. పరీక్షలో ఒకసారి ఒక పద్యానికి ప్రతిపదార్ధం వ్రాయమంటే, నేను తాత్పర్యం రాసేను. తెలుగు మాస్టారు చక్కగా సున్న మార్కులు వేసేరు. "తాత్పర్యం అంతా కరెక్ట్‌గా రాసేను కదా మార్కులెందుకు వెయ్యలేదు" అని దబాయించి అడిగితే, రెండు మొట్టికాయలేసి, అప్పుడు చెప్పేరు ప్రతిపదార్ధానికి, తాత్పర్యానికి తేడా. ఇప్పుడు, మా అబ్బాయిలు ప్రతి విషయాన్నీ తెలుగులోకి అర్ధం అనువదించి చెప్పకుండా, ప్రతిపదార్ధాన్ని మాట్లాడతారన్నమాట. ఉదాహరణలు: "నాన్నా, నేనొక హెయిర్‌కట్ తెచ్చుకోవచ్చా సన్‌డే మీద?" (Can I get a haircut on Sunday?); "అమ్మా, నా బర్త్‌డేమీద మనంకి ఒక వీడియో గేం కొంటావా?". ఇలాగే, కొన్ని కొన్ని వాక్యాల్ని "ఇది నీకు తెలుసా" అని మొదలుపెడతారు (ఇంగ్లీషులో "Do you know this, I have ..." అని మొదలుపెట్టినట్లు.

ఇలాంటివి కోకొల్లలు. మీకు కూడా ఇలాంటి తమాషాలు ఎప్పుడైనా ఎదురయ్యేయా?

కొసమెరుపు: అమెరికాకి వచ్చిన కొత్తలో మా శ్రీమతి ఒకసారి ఎపార్ట్‌మెంట్ క్లీన్ చెయ్యడానికి మెయింటెనెన్‌స్ వాడొస్తే, బూజులు దులపమని చెప్పడానికి ఏమనాలో తెలీక "క్లీన్ ఆల్ ద స్పైడర్స్ నెస్ట్" అందిట. వాడికి చాలాసేపు అర్ధం కాక జుట్టుపీక్కొన్నాడు. "సాలె గూడు" అనడానికి వచ్చిన తిప్పలవి. ఇంకా నయం. "సాలె మనిషి" ఈ మాటలు వినలేదు. విని ఉంటే, తన "స్పైడర్స్ నెస్ట్" నుంచి ఒక సాలె దారం తీసి ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు.

ఇక సెలవు,
కేకే