Tuesday, August 10, 2010

కేటరాక్ట్

ఈ టపా టైటిల్ చూసి నేనేదో కేటరాక్ట్ గురించి సైఎన్స్-అసైఎన్స్ కబుర్లు చెపుతానని అపోహ పడకండి. అలాంటి వాటికి వేరే బ్లాగులున్నాయి. ఇది ఊరికే ఊసుపోకకి రాస్తున్న నా స్వానుభవం.(BTW, Science ని సై-ఎన్స్ అని పలకాలనీ, సైన్స్ (signs) లాగ కాదనీ , మా అబ్బాయి దగ్గర నేర్చుకున్నానులెండి. అదీ బడాయి).

క్రిందటి శుక్లవారం, సారీ, శుక్రవారం, నా ఎడమ కంటికి కేటరాక్ట్ సర్జరీ (శుక్ల శస్త్రచికిత్స అనొచ్చా) అయింది. అప్పటినుంచి నాకు శుక్లాచార్యుడన్న బిరుదు సమసిపోయింది. ఆ రోజంతా నేను కంటికి "డ్రెస్సింగ్"తో శుక్రాచార్యుడిలా ఉండవలిసి వచ్చిందనుకోండి - అది వేరే విషయం. [శుక్లాచార్యుడికి, శుక్రాచార్యుడికి ఒక ముఖ్యమైన తేడా. ఏమిటో తెలుసునా అది? శుక్లాచార్యుడికి "ద్విదృష్టి" (అంటే Double Vision) ఉంటుంది. శుక్రాచార్యుడికి ఉండేది దివ్యదృష్టి. కాని ఆయన ఆ దివ్యదృష్టి ఉపయోగించబట్టే, తర్వాత "ఏకదృష్టి" గా అయేడన్నది వేరే కథ.]

ఇంతకీ, నాకు కంట్లో శుక్లాలు ఎలా వచ్చేయో ఎందుకు వచ్చేయో కారణం యే డాక్టరూ చెప్పలేదు. ఇవి నాకు చిన్నప్పటినుంచీ రెండు కళ్ళల్లో ఉన్నాయి. "ఇవి సాధారణంగా వయసు మళ్ళిన వాళ్ళలో వస్తాయి. నువ్వు చూస్తే అలా కనిపించడం లేదు" అని చెప్పి తప్పించుకున్నవాళ్ళే అందరు డాక్టర్లూ. నేనింకా వయసు మళ్ళని వాడిననే దురభిప్రాయం నాకు పోలేదనుకోండి. కాని, మిగతా డాక్టర్ల మాట అటుంచి, వైజాగ్‌లో ఇంజనీరింగ్ అవగానే చూపించుకోడానికి వెళ్ళిన కంటి డాక్టరు కూడా నన్ను చూసి "నువ్వు చూస్తే అలా కనిపించడం లేదు" అనడం ఏమన్నా సబబుగా ఉంటుందా? మీరే చెప్పండి. అందుకే, ఆయనకి మళ్ళీ కనిపించకుండా వచ్చేసాను.

ఆ మధ్య "వికీ"లో చదువుతుంటే తెలిసింది - సుశృతుడు మొదటగా కేటరాక్ట్ సర్జరీ చేసేడనీ, గ్రీక్ నుంచి, చైనా నుంచి కూడా ఇండియాకి వచ్చి అది నేర్చుకునేవారని. ఈ విషయం నా డాక్టరుకి చెప్పి "చూసారా మా ఇండియన్స్ ఎంత గ్రేటో" అని కాలరెగరేద్దామనుకున్నానుగాని , సర్జరీ ముందర చెబితే, ఎక్కడ మనసులో కుళ్ళుకుంటూ, పైకి నవ్వుతూ "ఔనోయ్! మీ ఇండియన్స్ ఎంతైనా గొప్పోళ్ళే. నువ్ చెప్పిన సంగతి నేను కూడా వికీ లో చూసానులే. బై-ది-బై, మీ సుశృతుడు కేటరాక్ట్ సర్జరీ, పేషెంట్లకి ఎక్కడా ఎనస్తీషియా ఇచ్చి చేసిన దాఖలాలేం రాయలేదందులో. మరి నీకు కూడా అలాగే లాగించేద్దామా ఏమిటి. నేను సర్జరీ త్వరగా చేసేసి ఇంకో ఇద్దరు పేషెంట్లకి ఎటెండ్ అవొచ్చు, పనిలోపనిగా నువ్వు కొంచం డాలర్లు సేవ్ చెయ్యనూవచ్చు" అంటాడేమోనని భయపడి చెప్పలేదు. మొత్తానికి నొప్పెరక్కుండా బాగానే చేసాడులెండి. లెన్స్ ఇమ్‌ప్లాంట్ చెయ్యడం వలన ఇప్పుడు కళ్ళజోడు కూడా లేకుండ చూడగలుగుతున్నాను. రాను రాను, vision ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేడు. జాగ్రత్త కోసం, మూడు వారాల వరకు, రాత్రి పడుకునేటప్పుడు, కంటి మీద patch వేస్కొని పడుకోవాలని చెప్పేడు (పైరేట్ ఆఫ్ ద కర్రీ-బీన్ లాగ).

ఆలోచించి చూస్తే నాకు, కేటరాక్ట్ సర్జరీ చేయించుకోడం వలన కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడ "కనబడు"తున్నాయండోయ్. నష్టం ఏమిటంటే - Double Vision వలన, నాకు 2-డి సినిమాలన్నీ ఇంతకు మునుపు 3-డి లో కనబడుతుండేవి (అవతార్ 4-డి లో చూసింది బహుశా నేనొక్కడినే అయుండొచ్చు). ఇప్పుడా యోగం లేదు. ప్చ్! అతి ముఖ్యమైన లాభం ఏమిటంటే, ఇంతకుముందు మా ఆవిడ ఇద్దరుగా కనబడేది. ఇప్పుడేమో......అర్ధమయిందిగా - మా ఆవిడకి నేను సగమే భయపడొచ్చు.

10 comments:

  1. ఒహో మా అసైన్సు బాగా పాపులర్ ఐనట్టున్నదే..చూస్తుంటే

    ReplyDelete
  2. క్యాటరాక్ట్ పై మంచి హాస్యాన్ని జోడించి రాసారు. బాగుంది..

    ReplyDelete
  3. కెక్యూబ్ గారు, నెనర్లండి

    ReplyDelete
  4. ఇంతకీ శుక్లాలు ఎల్లావస్తాయో ఇప్పటికైనా ఎవరన్నా చెప్పేరా అండి ? నాకు కూడా తెలుసు కోవాలని ఉంది.

    ReplyDelete
    Replies
    1. తెలీదండీ. ఇప్పటికి నా రెండు కళ్ళల్లో 4 సర్జరీలు అయాయి. కాని యే డాక్టరూ అవి ఎందుకొస్తాయో చెప్పలేదు. విచిత్రమేమిటంటే మా ఇంట్లో మా అన్నదమ్ములెవరికీ రాలేదు - నాకు తప్ప

      Delete
    2. ఇప్పుడు అంతా సరి అయ్యిందా? కులాసాగా ఉన్నారా?

      Delete
  5. టపా బాగుంది, మీ బ్లాగ్ మొత్తం చదివేశా.
    మీరు మహా పొదుపర్లు సుమా! నవ్వులు పంచడానికి కూడా ఇంత పొదుపా!!!

    ReplyDelete
  6. అతి సర్వత్ర వర్జయేత్ అని మీలాంటి పెద్దలు చెప్పేరు. అది పాటించాలి కదా :-)

    ReplyDelete